విజృంభిస్తున్న విష జ్వరాలు
విష జ్వరాలతో ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. ఒకవైపు స్వైన్‌ఫ్లూ… మరో వైపు డెంగ్యూ, వైరల్ జ్వరాలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. విష జ్వరాలతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చేరుతోన్న బాలికల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కుంటాల బాలికల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని మృత్యువాత పడటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం 21 మంది విద్యార్థులు విషజ్వరాలతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. బావుల్లోకి వరద నీరు చేరడంతో, ఆ నీరు కాస్తా కలుషితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్రత కారణంగానే విష జ్వరాలు విజృంభిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ పివో వరుణ్ రెడ్డి పర్యటించిన తర్వాత కూడా ఆశ్రమ పాఠశాలల్లో మార్పు రావడం లేదంటున్నారు. పిల్లలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. రెండేళ్ళ క్రితం జిల్లాలో డెంగీ విజృంభించి వందలాది మంది ఆసుపత్రి పాలు కాగా.. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో వైద్యాఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
