Home Page SliderNational

మణిపూర్‌లో హింసాకాండ, రంగంలోకి సైన్యం..! ఏం జరిగిందంటే!?

షెడ్యూల్డ్ తెగ హోదాపై కోర్టు ఆదేశాలతో గిరిజన సంఘాల నిరసనల మధ్య మణిపూర్‌లోని హింస ప్రజ్వరిల్లింది. ఇంఫాల్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పిలలో హింస చెలరేగడంతో గత రాత్రి మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వం మణిపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. పెరుగుతున్న హింసను అదుపు చేసేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

హింసాకాండతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 4,000 మంది బాధితులు, సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లో ఆశ్రయం పొందారు. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం గిరిజనేతర మైటీస్ కమ్యూనిటీ చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా బుధవారం ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) చురచంద్‌పూర్ జిల్లాలోని టోర్‌బంగ్ ప్రాంతంలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింస చెలరేగడంతో వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. “నా రాష్ట్రం మణిపూర్ మండుతోంది, దయచేసి సహాయం చేయండి” అని బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ ట్వీట్ చేసింది.

మణిపూర్ జనాభాలో మెయిటీ కమ్యూనిటీ 53% ఉంది. ప్రధానంగా వారు మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. “మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలు” దృష్టిలో ఉంచుకుని వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మెయిటీ తెగ వాదిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మెయిటీలు స్థిరపడేందుకు అవకాశం లేదు.

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ బుధవారం ఒక కార్యక్రమంలో ప్రసంగించాల్సిన వేదికను సైతం వారు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని అస్థిర పరిస్థితుల దృష్ట్యా, గిరిజనేతర ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలు, గిరిజనులు అధికంగా ఉండే చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.