Home Page SliderNational

కాంగ్రెస్ లోకి వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా

భారత స్టార్ రెజ్లర్లు వినోశ్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా కప్పుకున్నారు. మరోవైపు పార్టీలో చేరడానికంటే ముందే.. భారత రైల్వేలోని తమ ఉద్యోగాలకు వినేశ్, పునియా రాజీనామా చేశారు. ఇటీవల హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చ జరిపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం వినేశ్, పునియా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. నేడో, రేపూ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. అందులో వీరికి టికెట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేశ్ సోదరి బబితా 2019లో బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలైంది. ఇప్పుడు అదే స్థానం నుంచి వినేశ్ ను దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. హరియాణాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు రానున్నాయి.