ఏపీలో వినాయక చవితికే విఘ్నాలు
◆ ఆంధ్రాలో హిందువులకు వివిధ చలానాల పేరుతో మోత మోగిస్తున్న ప్రభుత్వం
◆ గతేడాది కరోనా కారణంగా వినాయక చవితి వేడుకలను ఇంటికే పరిమితం చేసిన ప్రభుత్వం
◆ ఈ ఏడాది కొత్త కొత్త నిబంధనల పేరుతో వినాయక చవితికి ఆంక్షలు
◆ ప్రభుత్వ నిబంధనలపై మండిపడుతున్న భక్తులు
సకల విఘ్నాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే దేవ దేవుడు విఘ్నేశ్వరుడు. వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయకుడు వివిధ రకాల ఆకృతులలో పూజలందుకుంటాడు. దేవుళ్లలోనే ఆదిదేవుడుగా హిందువులు వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయక చవితికి… ప్రతి హిందువు తమ ఇళ్లతో పాటు తమ ఏరియాలో అపార్ట్మెంట్లలో గ్రామాల్లో వినాయకుని ప్రతిమ పెట్టి అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వినాయకుడికి నవరాత్రులు ఘనంగా నిర్వహించి నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈనెల 31న వినాయక చవితి కావటంతో, కరోనా ఉధృతి తక్కువగా ఉండటంతో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా భక్తులు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కానీ వినాయకుని ఉత్సవాలు జరపడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలపై భక్తులు పెదవి విరుస్తున్నారు.

వినాయక చవితి జరుపుకోవడానికి ప్రభుత్వం అనేక నిబంధనల పేరుతో విఘ్నాలు సృష్టిస్తోందని వారు వాపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి గతంలో ఎప్పుడూ లేని నిబంధనలతో ఇదెక్కడ గోలరా బాబు అని భక్తులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్వకాలంలో పన్నులు విధించినట్లు మళ్లీ ఇప్పుడు అలానే జగన్ పన్నులు విధిస్తారా అంటూ మండిపడుతున్నారు. కేవలం హిందువుల పండగలను వైఎస్ జగన్ టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నారని హిందూ ధార్మిక పరిషత్‌లు ఆరోపిస్తున్నాయి. వినాయక చవితి పండగ ఉత్సవాలు అప్పుడే ఆయనకు నిబంధనలను గుర్తొస్తున్నాయని మరి ఏ ఇతర పండగలకు లేని నిబంధనలు వినాయక చవితి వేడుకలకు ఎందుకు విధిస్తున్నారని వాపోతున్నారు. గత ఏడాది కరోనా సాకు చూపించి ఎవరి ఇంటిలో వారే పండుగను వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం నిబంధనలను విధించడంతో.. గత ఏడాది వినాయక చవితి వేడుకలు కూడా భక్తులు ఘనంగా జరుపుకోలేక పోయారు. ఈ ఏడాది అయినా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుపుకుందామంటే ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలను విధించిందని… సీఎం జగన్ వినాయక చవితికి ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను తీసే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.

పందిరి అనుమతి కోసం, అఫిడవిట్ అందజేయటం, దేవుడు విగ్రహానికి సంబంధించి కొలతలు, ఎక్కడ ప్రతిష్టిస్తున్నారు స్థలం వివరాలు, ఆ స్థలానికి సంబంధించి పంచాయతీ పర్మిషన్ లేదా స్థల యజమాని పర్మిషన్, ఎన్ని రోజులు వేడుకలు జరుపుతారు, ఎన్ని రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు, నిమజ్జన మార్గం ఏంటో చెప్పడం, నిమజ్జనానికి వాడే వాహనం డ్రైవర్ వివరాలు లాంటి ఎన్నో నిబంధనలు ఆంక్షలు విధించటం దారుణమని భక్తులు అంటున్నారు. మైకు పెట్టాలంటే పర్మిషన్ చలానాలు కట్టడం, స్థానిక డీఎస్పీ ఆఫీసు చుట్టూ తిరగటం, కరెంట్ పర్మిషన్ కోసం తిరగటం ఇలాంటి నిబంధనలతో వినాయకుని ఉత్సవాలకు పోగుచేసిన చందా డబ్బులు అంతా ఈ పర్మిషన్ల కోసమే ఖర్చు అయిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉత్సవాలు జరపటానికి జగన్ సర్కారుకి ఎందుకు టాక్స్ కట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనేక నిబంధనలు విధించి భక్తుల మనో భావాలను దెబ్బతినేలా సర్కారు వ్యవహరించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం పునరాలోచిస్తుందా? లేదంటే నిబంధనలు కఠిన తరం చేసి వారి ఆగ్రహానికి గురవుతుందో చూడాలి.
