హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్
టీఆర్ఎస్‌కు ఆ పార్టీ కౌన్సిలర్ విజయారెడ్డి గుడ్ బై చెప్పనున్నారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ హైకమాండ్‌పై అసంతృప్తిగా ఉన్న విజయారెడ్డి… గులాబీ పార్టీలో ఉండటం వల్ల ఒరిగేదేం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని ఆశించి భంగపడ్డ విజయారెడ్డి కొంత కాలంగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ రేవంత్ ను కలవడంతో ఆమె పార్టీ మారబోతున్నారన్న క్లారిటీ వచ్చేసింది. త్వరలో తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు విజయారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు విజయారెడ్డి. పీజేఆర్ కుటుంబం మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉందని… అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈనెల 23న కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరనున్నట్టు ఆమె పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగేందుకు విజయారెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండటం వల్ల తనకు రాజకీయంగా ఉపయోగం లేదన్న భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పీజేఆర్ మరణం తర్వాత విజయారెడ్డి… వైసీపీ తరపున ఖైరతబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి వరుసగా రెండుసార్లు గెలిచారు.

