రెండు ఏనుగుల సింబల్ ఉన్న జెండాతో విజయ్
తమిళ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోని దిగుతున్నారు. ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీని ఆయన స్థాపించారు. ఇక తాజాగా ఈ పార్టీకి సంబంధించిన జెండాను విజయ్ ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ అభిమానులు పెద్దయెత్తున హాజరయ్యారు. ఎరుపు, పసుపు రంగులో ఉన్న జెండా మధ్యలో వాగాయ్ అనే జాతి పుష్పం ఉంది. ఈ పుష్షాలను విజయానికి ప్రతీకగా భావిస్తారు తమిళ ప్రజలు. పక్కన రెండు ఏనుగులు ఇరువైపులా ఉన్నాయి. ఈ జెండాను ఆవిష్కరించిన విజయ్, రాబోయే రోజుల్లో దేశమంతా తమ పార్టీ జెండా రెపరెపలాడేలా చూడాలని అభిమానులను కోరారు. ఇకపై తమిళనాడులో గొప్ప మార్పులు వస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధికారిక గీతాన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నిస్థానాల్లో తమ పార్టీ సొంతంగా పోటీ చేయబోతోందని విజయ్ తెలిపారు. తమ పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ఓ సమావేశం ద్వారా వివరిస్తామని విజయ్ తెలిపారు.