వేములవాడకు ఉప ఎన్నిక తప్పదా..?
మునుగోడు ఉప ఎన్నిక పూర్తయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ మధ్య కాలంలో మరో ఏదైనా ఉప ఎన్నిక రానుందా..? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో వేములవాడ శాసన సభకు ఉప ఎన్నిక జరుగుతుందంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు శాసన సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేస్తే ఉప ఎన్నిక మినహా ఈసీ వద్ద మరో మార్గం ఉండదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన చెన్నమనేనిపై ద్వంద్వ పౌరసత్వం కేసు నడుస్తోంది. తుది దశకు చేరుకున్న ఈ కేసులో హైకోర్టు తీర్పు త్వరలో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

చెన్నమనేని పౌరసత్వంపై కేసు..
చెన్నమనేని రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉందని.. భారత పౌరసత్వం రద్దయిందని.. భారతీయుడు కాని ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడంటూ చాలా కాలంగా కేసు నడుస్తోంది. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం 2019లోనే తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్ రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఆయన భారత పౌరుడు కాదని నిర్ధారణ అయితే ఎమ్మెల్యేగా అనర్హుడవుతారని.. అప్పుడు వేములవాడకు ఉప ఎన్నిక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.