తిరుమలకు 12 వేల వాహనాలు మాత్రమే పరిమితం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 26 నుండి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా అంతరాలయంలో జరుపుతున్న బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం భక్తుల సమక్షంలో మాడవీధుల్లో జరపనున్నారు. దీనితో భక్తులు భారీగా చేరుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా TTD ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు కలిపి 12 వేలు దాటిన తర్వాత అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రతీ సంవత్సరం గరుడసేవ రోజున ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించరు.
ఈ ఏడాది అక్టోబరు 1 వతేదీన గరుడసేవ జరగనుంది. దానితో ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అక్టోబరు 2 వరకు ద్విచక్రవాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. తక్కిన వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపివేసి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని సూచించింది టీటీడీ.
