Home Page SliderNational

అంబానీ వెడ్డింగ్‌లో వీణా శ్రీవాణి

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా అనేకమంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే వీరితో పాటు మన తెలుగు వీణ కూడా ఆ సంబరంలో సందడి చేసింది. యూట్యూబ్ ‌ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అమలాపురంలో ఇందుపల్లి అగ్రహారానికి చెందిన వీణా శ్రీవాణికి కూడా ఈ వేడుకకు వీణానాదం చేయడానికి ఆహ్వానం అందింది. స్వయంగా నీతా అంబానీ చెప్పారంటూ ఆమెకు మేనేజర్ ఫోన్ చేశారు. దీనితో ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానంటూ ఒక ఇంటర్యూలో పంచుకున్నారు. శ్రీవాణి ధరించే దుస్తుల నుండి, ఏ పాటలు వీణపై వాయించాలో కూడా నీతా అంబానీనే సెలక్ట్ చేశారని ఆమె తెలిపారు. తాను ఆమె ఎంపిక చేసిన జాబితా నుండి పది పాటలను నీతా సెలక్ట్ చేశారని తెలిపారు. హిందీ, తమిళం, తెలుగులలో ఉండే అనువాద చిత్రాల పాటలనే ఎన్నుకున్నానని ఆమె తెలిపారు.

ఆ వేడుకను చూడడానికి రెండుకళ్లూ చాలలేదని, బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో తన కచేరీ ఏర్పాటు చేశారని తెలిపారు. అంబానీ, రాధికల కుటుంబం మాత్రమే అక్కడ ఉన్నారని, వారు శ్రద్ధగా వింటూ, కావలసిన పాటలను అడిగి మరీ ఆస్వాదించారని పేర్కొన్నారు. తనకు ఒక కళాకారిణిగా కళల పట్ల వారికున్న గౌరవం తృప్తినిచ్చిందన్నారు. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషల్, శివమణి వంటి సంగీతకారులను చూసి ఎంతో ఆనందించానని పేర్కొన్నారు. నీతా అంబానీ స్వయంగా నృత్యకళాకారిణి కావడంతో ఈ వేడుకలలో కళా ప్రదర్శనలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారన్నారు. భోజనాలలో వేల రకాలు వడ్డించారని, తాను మాత్రం సలాడ్స్, కాఫీ తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తలచుకుంటే ఇదంతా కలలా జరిగినట్లు అనిపిస్తోందని, ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుండి సంగీతకళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని తానే తెలిసి, చాలా గర్వంగా ఫీలయ్యానని పేర్కొన్నారు. ఇదంతా సరస్వతీ కటాక్షం అని రెండుచేతులూ జోడించి వీణకు నమస్కరించారు శ్రీవాణి.