Andhra PradeshHome Page Slider

లోకేష్ పాదయాత్రలో నడిచిన వంగవీటి రాధా.. జనసేనలో చేరిక రూమర్లకు చెక్ !

టీడీపీలో అసంతృప్తిగా కనిపిస్తున్న వంగవీటి రాధా త్వరలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకుంటారంటూ జరుగుతున్న ప్రచారానికి ఇవాళ చెక్ పడింది. టీడీపీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నెల 14న మచిలీపట్నంలో జరిగే జనసేన ఆవిర్బావ సభలో రాధా ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. అయితే దీనికి రాధా ఇవాళ చెక్ పెట్టారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పీలేరు నియోజకవర్గంలో చేస్తున్న యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా దర్శనమిచ్చారు. లోకేష్ తో కలిసి కాసేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్ర విరామంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలోనే ఆయన కొనసాగుతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లయింది.

లోకేష్ పాదయాత్రలో హఠాత్తుగా వంగవీటి రాధా వచ్చి కలవడంతో టీడీపీ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తం చేశాయి. లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన వంగవీటి రాధా… ముందుగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాదయాత్రలో తనతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. నడుస్తూనే మధ్యలో తన అనుచరుల్ని లోకేష్ కు పరిచయం చేశారు. దీంతో లోకేష్ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అలాంటి సమయంలో జనసేన నుంచి తమ పార్టీలో ఆయన చేరబోతున్నారనే లీకులు రావడంతో అప్రమత్తమైంది. రాధాతో చంద్రబాబు నేరుగా ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరిగింది.

ఇప్పుడు లోకేష్ పాదయాత్రలోనే కలిసి నడవడంతో పార్టీ మార్పు రూమర్లకు చెక్ పడినట్లయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఈ నాలుగేళ్లలో కూడా రాధా ఏ నియోజవర్గంపైనా కూడా దృష్టి పెట్టలేదు. అయితే ఈరోజు టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొనడంతో వంగవీటి రాధా టీడీపీని వీడతారనే ప్రచారం ప్రచారంగానే మిగిలిపోనుంది .