వందేభారత్ ట్రైన్ రూట్ పై ఆసక్తికర మ్యాప్
భారత రైల్వేలో ఆధునిక రైళ్లుగా పేరు తెచ్చుకున్న వందేభారత్ రైళ్ల మార్గంపై ఆసక్తికర మ్యాప్ విడుదలయ్యింది. వందే భారత్ రైలు మార్గాలన్నీ కలిపితే భారతదేశ మ్యాప్ గా తయారు కావడం విశేషం. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్తోందని జీ20కి భారత్ తరఫున షెర్పాగా వ్యవహరించిన అమితాబ్ కాంత్ అన్నారు. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్ తో దేశాన్ని కలుపుతోంది’ అంటూ ఎక్స్ వేదికగా ఒక మ్యాపు షేర్ చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘వందే భారత్ రైలు మార్గాలు భారత భౌగోళిక చిత్రపటాన్ని ఆవిష్కరించేలా ఉండడంతో ఈ పోస్టు ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న వందేభారత్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు మాత్రమేనని, స్పీడ్ పెరిగి 130 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లాల్సిన అవసరం ఉందని, దానికోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఫిబ్రవరి 15న దిల్లీ- వారణాసి మధ్య తొలి వందే భారత్ ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్ల సంఖ్య 150కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే ప్రధాని మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అమృత్ సర్- శ్రీమాత వైష్ణోదేవి కత్రా, బెలగావి-బెంగళూరు, అజ్ని-పుణె వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను ఆయన స్వయంగా ప్రారంభించారు.


 
							 
							