మూసీ వద్ద ఇళ్లు ఖాళీ చేయండి..
మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు అర్జెంటుగా ఖాళీ చేయమంటూ బల్దియా అలర్ట్ చేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, మూసీ నది పొంగి పొర్లుతున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. వికారాబాద్, తాండూర్ వంటి ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడడంతో దిగువకు భారీ వరద పోటెత్తింది. జంట జలాశయాలకు భారీగా వరదనీరు వచ్చిచేరింది. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ గేట్లు ఎత్తితే మూసీనదికి ఫ్లో పెరిగి చుట్టు పక్కల ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. గ్రేటర్ సిటీకి మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జియాగూడా, మూసారం బాగ్, కర్మన్ ఘాట్ ప్రాంతాలను అధికారులు సందర్శించారు. ఈ ప్రదేశాలను అలెర్ట్ చేశారు. నదికి దగ్గరగా ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి, సురక్షిత్ ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.