ఉత్తమ్ కు సొంత శాఖపై పట్టు లేదు
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందని, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు .అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ సోమవారం హరీశ్ రావు మాట్లాడుతూ , ఉత్తమ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తాము నేల మీద పడుకుని పనిచేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో మన వాటాను 90 టీఎంసీల నుండి 45 టీఎంసీలకు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ను నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడు అనుమతులు తెచ్చామని, ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అనుమతైనా తెచ్చిందా అని ప్రశ్నించారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ అని, తన చేతకానితనాన్ని బీఆర్ఎస్ మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. సొంత శాఖపై పట్టులేని ఉత్తమ్, ఇంకా ఎప్పుడు జ్ఞానం పెంచుకుంటారో అని సెటైర్లు వేశారు.
శాసనసభను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో పట్టుబట్టినట్లు హరీశ్ రావు తెలిపారు. నదీ జలాల అంశంపై ప్రభుత్వం పీపీటీ ఇస్తే, తాము కూడా పీపీటీ ద్వారా వాస్తవాలను వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలను వేయాలని డిమాండ్ చేశారు. సభ ఎజెండాను 24 గంటల ముందే సభ్యులకు పంపాలని, సుమారు 15 ప్రధాన అంశాలపై సభలో చర్చ జరగాలని తాము పట్టుబట్టినట్లు హరీశ్ రావు వెల్లడించారు.

