InternationalNews

అమెరికా శత్రువు… రష్యాకు మిత్రుడు

యుఎస్ విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం

అమెరికా నుంచి పారిపోయిన ఎడ్వర్డ్ స్నోడెన్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. అమెరికాలో 2013లో రహస్య ఫైళ్లను లీక్ చేసిన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా దేశం విడిచివెళ్లాడు. రష్యాలో ఆశ్రయం పొందాడు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ దేశీయ, అంతర్జాతీయ నిఘా కార్యకలాపాలను తాను కాంట్రాక్టర్ గా ఉండి బహిర్గతం చేయడంతో చిక్కుల్లోపడ్డాడు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA రహస్య నిఘా కార్యకలాపాల స్థాయిని బహిర్గతం చేసిన తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం రష్యా పౌరసత్వాన్ని మంజూరు చేశారు. గూఢచర్యం ఆరోపణలపై క్రిమినల్ విచారణను ఎదుర్కొనేందుకు US అధికారులు సంవత్సరాలుగా అమెరికా రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

72 మంది విదేశాల్లో జన్మించిన వ్యక్తులకు పుతిన్ పౌరసత్వాన్ని ప్రదానం చేశారు. రష్యా పౌరసత్వం కల్పించినా… మొత్తం పరిణామాలపై స్నోడెన్ ఇంత వరకు స్పందించలేదు. ఉక్రెయిన్ యుద్ధం కోసం స్నోడెన్‌ను పుతిన్ వినియోగిస్తారా అంటూ రష్యన్లు జోకులు వేయడం విశేషం. ఐతే మొత్తం వ్యవహారంపై స్పందించిన స్నోడెన్ న్యాయవాది అనటోలీ కుచెరెనా… రష్యా సైన్యంలో పని చేసేందుకు తన క్లైయింట్ ను పిలవలేమన్నారు. 2020లో మగబిడ్డకు జన్మనిచ్చిన స్నోడెన్ భార్య లిండ్సే మిల్స్‌కు సైతం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. స్నోడెన్‌కు గతంలోనే శాశ్వత నివాస హక్కులను మంజూరు చేసిన రష్యా… అతను పౌరసత్వాన్ని పొందేందుకు మార్గం సుగమం చేసింది. రష్యాలో ఉంటూ తక్కువ ప్రొఫైల్‌లో ఉండే స్నోడెన్ అమెరికా రహస్యాలను లీక్ చేయడం తప్పే కానీ దేశద్రోహి కాదని రష్యా మాజీ గూఢచారి చీఫ్ ఇప్పటికే చెప్పారు.