‘టిక్‌టాక్’ సీఈవోను విచారించిన అమెరికన్ కాంగ్రెస్
అమెరికా, చైనాల మధ్య ఆధిపత్యపోరు ‘టిక్‌టాక్’పై ప్రభావం చూపుతోంది. ఈ యాప్‌ను ఎందుకు నిషేధించకూడదంటూ టిక్‌టాక్ సంస్థ సీఈవో ‘షౌజీచూ’ను అమెరికన్ కాంగ్రెషనల్ కమిటీ నిన్న గురువారం తీవ్రంగా ప్రశ్నించింది. ఈ యాప్‌ను అమెరికాలో 15 కోట్ల మంది వినియోగదారులు వాడుతున్నారు. అమెరికా కాంగ్రెస్, శ్వేతసౌధం, సైనికులు, ఈ యాప్‌ను వాడకుండా ఇప్పటికే నిషేధం విధించారు.అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాలలో కూడా ఈ నిషేధం ఉంది. దీనివల్ల అమెరికా దేశ ప్రజల వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగే అవకాశముందని ఈ కమిటీ అభిప్రాయపడింది. ఈ యాప్ మాతృసంస్థ ‘బ్రైట్ డాన్స్’ చైనాకు గానీ, మరే ఇతర దేశానికి గానీ ఏజెంట్ కాదని, తమ యాప్ వల్ల జాతీయ భద్రతకు ఏమాత్రం ముప్పు ఉండదని సీఈవో చూ తెలిపారు. తమ యువ వినియోగదారుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని, ఈ యాప్ పూర్తి సురక్షితమని వాదించారు టిక్‌టాక్ సీఈవో.