తెలంగాణ శాసనసభలో యూరియా సెగ
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది . రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ శాసన సభలో నిరసనకు దిగింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు . “కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది” అంటూ విమర్శలు గుప్పించారు. వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని, వాయిదా తీర్మానం ద్వారా దీనిపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు.
ప్రతిపక్షాల ఆందోళనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ సభ్యులకు ప్రశ్నోత్తరాల సమయం జరగడం ఇష్టం లేనట్లుందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిబంధనల ప్రకారం చర్చకు రావాలే తప్ప, నినాదాలతో సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోరగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానికి అనుమతి నిరాకరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశం లేదని హరీశ్ రావుకు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా నిరసన కొనసాగించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతులకు యూరియా సరఫరాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ప్రతిపక్షం కావాలనే సభను అడ్డుకుంటోందని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.

