NationalNews

ములాయం కుటుంబంలో ఒడిదుడుకులు..

దేశ రాజకీయ రంగంలో చక్రం తిప్పిన ములాయం సింగ్‌ యాదవ్‌ వ్యక్తిగత, కుటుంబ జీవితం మాత్రం ఒడిదుడుకులతో కొనసాగింది. అయినా.. దాని ప్రభావం రాజకీయాల్లో పడనీయకుండా ముందుకు దూసుకెళ్తూ అపర చాణక్యుడిగా ప్రఖ్యాతిగాంచారు. ములాయం.. ఎటావా జిల్లాలోని సైఫాయ్‌ గ్రామంలో మూర్తి దేవి, సుఘర్‌ సింగ్‌ యాదవ్‌ దంపతులకు 1932 నవంబరు 22వ తేదీన జన్మించారు. ఇటావాలోని కర్మక్షేత్ర పోస్టు గ్రాడ్యుయేట్‌ కాలేజీ నుంచి బీఏ, ఆగ్రా విశ్వవిద్యాలయంలోని బీఆర్‌ కళాశాల నుంచి ఎంఏ పట్టా పొందారు.

ములాయం మొదటి భార్య మాలతీదేవి..

ములాయం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య మాలతీదేవిని 1980లో వివాహమాడారు. ఆమెకు పుట్టిన కుమారుడే అఖిలేష్‌ యాదవ్‌. ఇప్పుడు ములాయం వారసుడిగా సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలు అఖిలేష్‌ చేతికే వెళ్లాయి. మాలతీదేవి 2003లో కన్నుమూశారు. సాధనా గుప్తాతోనూ ములాయంకు సంబంధం ఉంది. చంద్రప్రకాశ్‌ గుప్తాను పెళ్లి చేసుకున్న సాధనా గుప్తా.. ములాయంతో సంబంధం కొనసాగించింది.

సాధనా గుప్తా రెండో భార్య..

ఫతేనగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో ప్రతీక్‌ గుప్తాకు 1987లో సాధనా గుప్తా జన్మనిచ్చింది. ఆ పిల్లాడు ములాయం సంతానమేనని సాధనా గుప్తా 2007లో సుప్రీంకోర్టులో అంగీకరించింది. ములాయం కూడా సాధనా గుప్తాను రెండో భార్యగా అంగీకరించారు. అప్పటి నుంచి ములాయం రెండో భార్యగా మారిన సాధనా గుప్తా ఈ ఏడాది ఆగస్టులో ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా మృతి చెందింది. ప్రతీక్‌ యాదవ్‌గా మారిన సాధనాగుప్తా కుమారుడు ప్రతీక్‌ గుప్తా.. ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబానికి చెందిన భూమిని నిర్వహిస్తున్నాడు. ప్రతీక్‌ భార్య, ములాయం కోడలు అపర్ణా యాదవ్‌ బీజేపీ నాయకురాలిగా ఉన్నారు.

రెండుగా చీలిన ములాయం కుటుంబం..

యువకుడైన అఖిలేష్‌ యాదవ్‌ 2012లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ములాయం కుటుంబం రెండుగా చీలింది. ఒకటి అఖిలేష్‌ వర్గం, ములాయం సోదరుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్‌, సమీప బంధువు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ కలిసి మరో వర్గంగా మారారు. ములాయం మాత్రం రామ్‌గోపాల్‌ వర్గానికే అండగా నిలిచారు. ములాయం 2016లో తన కుమారుడు అఖిలేష్‌ను, రామ్‌గోపాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని 24 గంటల్లోనే ఉపసంహరించుకోవడం విశేషం. చివరికి పార్టీ పగ్గాలను అఖిలేష్‌ యాదవ్‌ చేజిక్కించుకొని.. ములాయంను పార్టీ ప్రధాన పోషకుడిగా నియమించారు.