Home Page SliderNational

సినీ ఇండస్ట్రీకి రాయితీలు, వరాలు ప్రకటించిన యూపీ సీఎం యోగి

ముంబైలో బాలీవుడ్ ప్రముఖులను కలిసిన యోగి ఆదిత్యనాథ్
హాజరైన బోనీ కపూర్, సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, సునీల్ శెట్టి, మధుర్ భండార్కర్
యూపీలో స్టూడియోలు కడితే రాయితీలిస్తామన్న యోగి
సినీ పరిశ్రమకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చిన యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‌ను సినిమా-స్నేహపూర్వక రాష్ట్రంగా ప్రదర్శిస్తూ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రాన్ని చలనచిత్ర నిర్మాణ గమ్యస్థానంగా అన్వేషించడానికి వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖ సభ్యులను ఆహ్వానించారు. ముంబైలో బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇద్దరు సినీ సోదరులను ఎంపీలుగా చేసామన్నారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు తెలుసునన్నారు. సమాజాన్ని ఏకం చేయడంలో, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో సినిమా కీలక పాత్ర పోషిస్తుందని యోగి చెప్పారు.

వచ్చే నెలలో లక్నోలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సును ప్రోత్సహించేందుకు ముంబై వచ్చిన యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమకు అనుకూల రాష్ట్రంగా ఆవిర్భవించిందని, జాతీయ చలనచిత్ర అవార్డులు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ద్వారా గుర్తింపు లభించిందని అన్నారు. ముంబైలో సినీ ప్రముఖులతో ‘న్యూ ఉత్తరప్రదేశ్’లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగిందని ట్విట్టర్లో యోగి తెలిపారు.

ఇండస్ట్రీ యూపీకి రావడం వల్ల… సురక్షితమైన వాతావరణంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు మంచి కనెక్టివిటీ ఉందని, ఇది సినీ నిర్మాణాలకు ఎంతగానో సహకరిస్తోందన్నారు. ప్రభుత్వం సినిమా పాలసీ ప్రకారం యూపీలో వెబ్ సిరీస్ చిత్రీకరిస్తే 50 శాతం సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే స్టూడియోలు, ఫిల్మ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 25 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోనీకపూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎంపీ, నటుడు రవికిషన్, భోజ్‌పురి నటుడు దినేష్ లాల్ నిర్హువా, నేపథ్య గాయకులు సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, నటుడు సునీల్ శెట్టి, సినీ నిర్మాతలు చంద్రప్రకాష్ ద్వివేది, మధుర్ భండార్కర్, రాజ్‌కుమార్ సంతోషి తదితరులు పాల్గొన్నారు.