ఉప ఎన్నికలు వస్తే తప్ప కేసీఆర్‌కు అభివృద్ధి గుర్తుకు రాదు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ…ఉప ఎన్నికలు వస్తే తప్ప కేసీఆర్‌కు అభివృద్ది గుర్తుకు రావడం లేదని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వం బీజేపీ కాదని.. కేసీఆర్ లాంటి అవినీతి నాయకులకు మీటర్లు పెట్టే పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను రెండు సార్లు గెలిపిస్తే ఏం అభివృద్ధి చేయలేదని డీకే అరుణ ఆరోపించారు. డబుల్ బెడ్‌రూం ఇల్లు..రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చరా ఆమె ప్రశ్నించారు. మనం కట్టే పన్నుల ద్వారా, మద్యం ద్వారా వచ్చే రాబడితో రూ.2 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇది తెలియక మన అమ్మలు కేసీఆర్ పెద్ద కొడుకు అంటున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.