Home Page SliderTelangana

‘స్వమిత్వ పథకం అమలు చేయండి సార్’ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.

గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకం అమలు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ వ్రాసారు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు వారి గృహాలకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించి, తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 ఏప్రిల్, 2021 న “సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది & మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వమిత్వ)” పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ప్రారంభించారు.

ఈ పథకం క్రింద పొందిన ఆస్తి ధృవీకరణ పత్రాల ద్వారా బ్యాంకుల నుండి ఋణాలు తీసుకోవటానికి, ఇతర ప్రయోజనాలను పొందటానికి వీలుగా ఉంటుంది. ఈ పథకం ద్వారా రూపొందించిన ల్యాండ్ రికార్డులు గ్రామీణాభివృద్ధి ప్రణాళికకు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా, సాధారణంగా వచ్చే ఆస్తి వివాదాలు కూడా ఈ ల్యాండ్ రికార్డుల మూలంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ల్యాండ్ రికార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ధరణి పోర్టల్ నందు ఎదురవుతున్న సమస్యల మూలంగా లక్షలాదిమంది తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.

ఇన్ని ప్రయోజనాలు కల  ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన చొరవ చూపించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వమిత్వ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నాను. అంటూ లేఖను పంపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.