Home Page SliderNational

మధ్యాహ్న భోజనంలో విద్యార్ధులకు ఊహించని షాక్

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని  ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే పోషకాల విషయం పక్కన పెడితే.. ఈ భోజన పథకం పిల్లల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఈ భోజనం తయారు చేసే క్రమంలో తగిన రక్షణ చర్యలు పాటించకపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు అనేకసార్లు చోటు చేసుకున్నాయి. అయితే ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లోని భీర్భూమ్ జిల్లా మయూరేశ్వర్  ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనంలో ఎవ్వరూ.. ఊహించని విధంగా పాము పిల్ల వచ్చింది. దీంతో  ఆహరాన్ని తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా పప్పు నింపిన కంటైనర్‌లో పాము కన్పించిందని సిబ్బంది తెలిపారు. అయితే ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించారు.