Andhra PradeshHome Page Slider

లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ

చదువులతోనే పేదరికాన్ని రూపుమాపగలమన్న సీఎం జగన్
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద.. 12,132 మంది ఖాతాల్లో రూ.87.32 కోట్లు జమ
చెల్లెమ్మల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే విద్యార్హత ప్రమాణాలు
పేదల కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా ఉంటున్నాం.. జ‌గ‌న్‌
బాల్యవివాహల కట్టడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

“పిల్లల చదువు ఇంటికి వెలుగు- ఇల్లాలి చదువు వంశానికే వెలుగు’ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, బాల్యవివాహాలను నివారించడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని చెల్లెమ్మలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వైఎస్సార్ షాదీ తోఫాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు సీఎం జగన్.

కళ్యణమస్తు, షాదితోఫా పథకాల నిధులు విడుదల

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద.. 12,132 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.87.32 కోట్ల నగదు సీఎం జగన్ బటన్ నొక్కి జమచేశారు. పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పథకాల అండగా నిలుస్తున్నాయన్నారు. క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్‌ నగదు జమ చేశారు. ఇప్పుడు అందించిన సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు చేకూరిందన్నారు. ఇప్పటి వరకు వీరి ఖాతాల్లో వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.

చెల్లెమ్మలకు పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి..

కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా కాకుండా వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందడానికి పదో తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించినట్లు తెలిపారు. ఇంటర్ వరకు జగనన్న అమ్మ ఒడి కింద రూ.15 వేలు, జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్స్, జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తుండటంతో ఉన్నత చదువులు కూడా సాకారమవుతున్నాయని అన్నారు.

వాళ్లు సాయం చేస్తామని చెప్పి ఎగ్గొట్టారు

నేడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి దుస్థితి లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అందిస్తామని ఎగ్గొట్టిన సాయానికి దాదాపు రెట్టింపు ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.