కంట్రోల్ కాని ట్రాఫిక్ జామ్‌లు.. దారిన పడేదెట్టా!
నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సిబ్బంది లేక ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జాం అవుతోంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సంఖ్య 18 నుండి 31కు పెంచినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు వసూళ్ల దందాతో హల్‌చల్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐలు, పోలీసులు, హోంగార్డులకు లక్ష్యం నిర్దశిస్తున్నారు. దీంతో ఎటూ పాలుపోక కొందరు ఆందోళనకు గురై ఆసుపత్రుల పాలైనట్టు సమాచారం. హోటళ్ల నుండి నెలవారీ వసూళ్లు చేయట్లేదని ఒక ఏసీపీ ఎస్ఐను తీవ్ర పదజాలంతో దూషించడంతో విషయం ఉన్నతాధికారుల వరకూ చేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, చార్మినార్, గోల్కొండ, ట్యాంక్‌బండ్ తదితర పర్యాటక ప్రాంతాల్లో ఇష్టానుసారం వాహనాలు రోడ్లపై నిలపడంతో తరచూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

