యావదాస్తిని ఆస్పత్రికి రాసిచ్చిన మహిళ
గుంటూరు వైద్యురాలు అరుదైన ఖ్యాతి
యావదాస్తి జీజీహెచ్‌కు దానం
రూ. 20 కోట్ల ఆస్తి పత్రాలు అందజేత
నయాపైసా ఉంచుకోకుండా వితరణ
ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గవిని ఉమ
అప్పుడప్పుడు మనం మనుషులం అని అనిపించుకోవాలని చాలా మందికి అన్పిస్తుంటుంది. తోటి వారి కష్టాలు విన్నప్పుడు కొందరు చలిస్తారు. కొందరు కకావికలం అవుతుంటారు. అందుకే ఆపదలో మనుషులకు సాయం చేయాలంటారు. మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. నిజంగా కొందరు అలాంటి గొప్ప వ్యక్తులు భూమిపై ఇంకా జీవించి ఉండటం వల్లే ఆ మాధవుడు మనందరినీ చల్లగా చూస్తున్నాడు. చిన్న సాయం చేసి.. ఎంతో పెద్దగా ప్రచారం చేసుకుంటున్న నేటి మన సమాజంలో ఇప్పుడు జీవిస్తున్నాం. సాయాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ.. తద్వారా మరికొంత రాబడి పొందాలని చూస్తున్న ఈరోజుల్లో తాను చదువుకున్న కాలేజీకి యావదాస్తిని డోనేషన్‌గా ఇచ్చి ఔరా అన్పించుకున్నారు డాక్టర్ ఉమా గవిని. 50 ఏళ్లుగా కష్టపడిన తన ఆస్తి మొత్తాన్ని తృణప్రాయంగా గుంటూరు జనరల్ హాస్పటల్‌కు రాసిచ్చారు.

ఇటీవలే భర్త చనిపోవడంతో.. తనకు ఉన్న ఆస్తి మొత్తాన్ని జీజీహెచ్‌కు ఇచ్చేసిన ఉమ.. కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంచుకోలేదు. దాన కర్ణుడి గురించి మనం మహాభారతంలో చూశాం.. ఇప్పుడు ఉమ తీసుకున్న నిర్ణయం… అందుకే ఏ మాత్రం తీసిపోదని చెప్పాల్సి ఉంటుంది. 20 కోట్ల రూపాయల ఆస్తిని జీజీహెచ్‌లో నూతనంగా నిర్మిస్తున్న మాతా, శిశు సంక్షేమ భవనానికి విరాళంగా అందించారు. గుంటూరులో జన్మించిన ఉమ అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఆమె 1965లో ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఉన్నత విద్య తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య విద్యార్థుల పూర్వ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఉమ… జీజీహెచ్‌కు భూరి విరాళం ఇవ్వాలనుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు సంపాదించిన దాంట్లో నయా పైసా ఉంచుకోకుండా మొత్తాన్ని విరాళంగా ప్రకటించడంతో అక్కడ ఉన్న మిత్రులంతా ఆశ్చర్యపోయారు.

గవిని ఉమా.. 2008లో జింఖానా అధ్యక్షురాలిగానూ వ్యవహరించారు. ఐతే ఇంత పెద్ద మొత్తం విరాళంగా అందించినందుకు గానూ… జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌కు ఆమె పేరు పెడతామని సభ్యులు సూచించగా.. ఆమె తిరస్కరించారు. ఐతే మిత్రులు గట్టిగా కోరడంతో ఆ నిర్మాణానికి తన భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరు పెట్టాలని సూచించారు. గవిని ఉమ స్ఫూర్తితో మరికొందరు వైద్యులు సైతం జీజీహెచ్‌కు సాయం ప్రకటించారు. డాక్టర్ మొవ్వ వెంకటేశ్వర్లు 20 కోట్లు, డాక్టర్ సూరపనేని కృష్ణప్రసాద్, షీలా దంపతులు 8 కోట్లు, తేళ్ల నళిని, వెంకట్ దంపతులు 8 కోట్ల మేర సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.