ఉక్రెయిన్ అధ్యక్షుడికి రోడ్డు ప్రమాదంలో గాయాలు
రష్యాతో సుదీర్ఘ యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఆయన ప్రయాణిస్తున్న కారును, పక్కనున్న కాన్వాయ్‌ను ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. అధికారులు వెంటనే జెలెన్‌స్కీని, ఆయన కారు డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదంలో జెలెన్‌స్కీకి, డ్రైవర్‌కు తీవ్ర గాయాలేవీ కాలేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. జెలెన్‌స్కీ ఆరోగ్యంపై అధ్యక్ష కార్యాలయం హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది. ఇది యాక్సిడెంటేనా.. హత్యకు కుట్ర జరిగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేపడతామని ఉక్రెయిన్ అధికారి సెర్గీ నికిఫోరెవ్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఢీ కొట్టిన కారులోని వ్యక్తులు పరారయ్యారు. వాళ్ల కోసం గాలిస్తున్నారు. ఖర్కీవ్ ప్రాంతంలో రష్యా బలగాలు వెనక్కి మళ్లాయంటూ జెలెన్‌స్కీ బుధవారం రాత్రి ఓ వీడియోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం విశేషం.