Home Page SliderNational

సభ్యసమాజం తలదించుకునేలాంటి ఘటన… నివ్వెరపోయిన దేశం

మధ్యప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. బాలికను అత్యాచారం చేసిన తర్వాత దుండుగులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమయ్యింది. బాలికకు ఆ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం చేసేందుకు రాకపోవడం శోచనీయం. ఈ తరుణంలో బాలిక రక్షణ కోసం పూజారి చేసిన సాయం సమున్నతమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలిని రక్షించడానికి వచ్చిన పూజారి, బాలిక భయానక స్థితిని వివరించాడు. రాహుల్ శర్మ ఉజ్జయిని నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్‌నగర్ రోడ్డులోని ఆశ్రమంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర రక్తస్రావంతో అర్ధనగ్నంగా ఉన్న బాలికను గమనించాడు. “నేను ఆమెకు నా బట్టలు ఇచ్చాను. ఆమెకు రక్తం కారుతోంది, మాట్లాడలేకపోయింది. కళ్లు వాచిపోయాయి. నేను 100కి కాల్ చేసినా, స్పందన రాలేదు” అని చెప్పాడు.

ఆ తర్వాత మహకాల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి పరిస్థితి చెప్పగా.. వారు దాదాపు 20 నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకున్నారని పూజారి వివరించాడు. గాయపడిన, అర్ధనగ్నంగా ఉన్న బాలిక సహాయం కోసం ఇంటింటికీ వెళ్లినా ఎవరూ స్పందించకపోవడం, మొత్తం ఘటన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఎంతో ఆందోళన నెలకొంది. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత మాత్రమే ఆమెకు సహాయం లభించింది. అమ్మాయి తమతో మాట్లాడుతోందని, అయితే వారు ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని పూజారి చెప్పాడు. ఆమె పేరు, ఆమె కుటుంబం గురించి అడిగాం. ఆమె సురక్షితంగా ఉందని, కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. పోలీసుల రాక కోసం ఎదురుచూడడంతో బాలిక తనను విశ్వసించిందని పూజారి తెలిపారు. “ఎవరైనా ఆమె వద్దకు వచ్చినప్పుడల్లా, ఆమె నా వెనుక దాక్కోవడానికి ప్రయత్నించింది. అప్పుడు పోలీసులు వచ్చి ఆమెను తమతో తీసుకెళ్లారు.” అని ఆయన చెప్పారు. అమ్మాయి ఏదో ఒక ప్రాంతం గురించి మాట్లాడుతోందని, పూజారి ఆ ప్రదేశం తమకు అర్థం కాలేదన్నాడు.

ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అత్యాచారం కేసు నమోదు చేయబడిందని… లైంగిక నేరాల నుండి పిల్లలకు కఠినమైన రక్షణ (పోక్సో) చట్టం నిబంధనలు అమలు చేశామన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఉజ్జయినిలోని లైంగిక వేధింపులకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక సంఘటనపై తీవ్ర వేదనను వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ. ఉజ్జయిని వంటి నగరంలో మహాకాలుడి నివాసంగా మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన నగరంలో ఇలా జరగడం దారుణమన్నారు.