కాలిఫోర్నియాలో గాల్లోనే రెండు విమానాలు ఢీ…
ఆమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియాలో వాట్సన్‌విల్లే మునిసిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో రెండు విమానాలు (ట్విన్-ఇంజన్ సెస్నా 340, సింగిల్ ఇంజన్ సెస్నా 152) ఢీకొని ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం ప్రకారం గురువారం సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు. భూమికి 200 మీటర్ల ఎత్తులో రెండు తేలికపాటి విమానాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సెస్నా 152లో ఇద్దరు, సెస్నా 340లో నలుగురు ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
