టీడీపీకి ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఇవాళ డుమ్మా..?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. మొదట్నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి… నిన్న జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటేశారని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. దీనికి సంబంధించి డైరెక్ట్ హింట్స్ ఇవ్వనప్పటికీ… వీరిద్దరే పార్టీ అభ్యర్థికి ఓటేయలేదన్న అభిప్రాయానికి పార్టీ వచ్చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ఇప్పటికే నిఘా పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే జగన్ కరాఖండీగా చెప్పడంతో… వారి దారి వారు చూసుకున్నట్టుగా వైసీపీ అంచనా వేస్తోంది. వాస్తవానికి మరో అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు… సదరు నేతకు ఓటేసేవారంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పటికే టికెట్లు రాని ఎందరో నేతలు.. పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడే బయటకు వస్తే ఇబ్బందన్న భావనలో ఉన్నారని నక్కా చెప్పారు.