మహారాష్ట్రలో రెండు బస్సులు ఢీ… ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. గత వారమే ఇదే బుల్దానా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఇలా రోజుల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం విషాదం కలిగిస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న ఒక బస్సు, నాసిక్మ్ వైపు వెళ్తున్న ట్రక్కును ఓవర్ టేక్ చేస్తూ, ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20 మందికి తీవ్రగాయాలు, 32 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం నుండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.