ఓటమిని అవకాశంగా మార్చుకున్నా!..మంత్రి నారా లోకేశ్
ఘన చరిత్ర గల వీఆర్ హైస్కూల్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందడుగు వేసినట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం ఆయన ఈ పాఠశాలలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, రాజకీయ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వ్యక్తిత్వాలకి వీఆర్ హైస్కూల్ విద్యాబుణిగా నిలిచిందని గుర్తుచేశారు.మూసివేయబడిన పాఠశాల తిరిగి ప్రారంభం కావడంలో నారాయణ గారు కీలక పాత్ర పోషించారని లోకేశ్ ప్రశంసించారు. తన నియోజకవర్గమైన మంగళగిరిలోని నిడమర్రు పాఠశాలను స్వయంగా దత్తత తీసుకున్నట్టు తెలిపారు. తరగతులు, డిజిటల్ బోధన పద్ధతులు, లైబ్రరీను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన లోకేశ్, వారితో క్రికెట్, వాలీబాల్ ఆటల్లో పాల్గొన్నారు.“ఓటమిని స్వీకరించి, కష్టపడి పనిచేసి, తిరిగి మెజారిటీతో గెలిచాను. అదే విద్యార్థులకూ నేర్పాలి. క్రమశిక్షణ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు” అని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని, యూనిఫార్మ్‌లు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరాలన్నదే లక్ష్యమన్నారు.ఈ సందర్భంగా పీ4 కార్యక్రమంలో పాల్గొన్న పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి లను మంత్రి సత్కరించారు.

