Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కల్తీ నెయ్యి కేసులో టీటీడీ జీఎం అరెస్ట్

తిరుమల శ్రీ‌వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ కె. సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసింది. ఈ కేసులో టీటీడీకి చెందిన ఉన్నతాధికారిపై తీసుకున్న ఇదే తొలి అరెస్ట్ కావడంతో దర్యాప్తు వేగం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అరెస్ట్ అవగా, మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరింది.

సిట్ దర్యాప్తులో, లడ్డూకు సరఫరా చేసే నెయ్యి కొనుగోలు ప్రక్రియలో తప్పుడు చర్యలు, నాణ్యత లేని నెయ్యి సరఫరాకు ప్రోత్సాహం వంటి అంశాల్లో సుబ్రహ్మణ్యం ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. ముందు విచారించిన కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాచారంతో ఆయన పాత్ర స్పష్టమైనట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి.

అరెస్ట్ చేసిన తర్వాత జీఎం సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల ఆధారంగా రిమాండ్‌కు పంపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

లడ్డూ ప్రసాదం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు దగ్గరగా ఉండటంతో, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద కలకలం రేపింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సాగుతోంది