హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు టీఎస్పీఎస్సీ
గ్రూప్ 1పై హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయంపై టీఎస్పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చారు. రద్దు ఆదేశాలతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు కమిషన్‌లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పరీక్ష రెండుసార్లు రాశామని… మరోసారి రాయలంటే కష్టమన్న భావనలో అభ్యర్థులుండగా, మరోసారి నిర్వహించడం కత్తిమీద సామన్న అభిప్రాయం ఉంది. గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడం ప్రభుత్వానికి చెంప పెట్టన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కోర్టు తీర్పుతో కేసీఆర్ సర్కారు సిగ్గుపడాలన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుకుంటున్నాడంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని.. కొత్త ఉద్యోగాలు నింపుతామని.. ప్రైవేట్ లో ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఒకటి నెరవేర్చలేదు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేస్తే 17 పేపర్లు లీక్ చేసి వారి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టని విమర్శించారు.