సత్యమే ఆయుధం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం:రాహుల్
ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సెషన్స్ కోర్టు నుండి బెయిల్ పొందిన తరువాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. “సత్యమే నా ఆయుధం” “ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం, మిత్రలకళకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందన్నారు. ఈ పోరాటంలో సత్యమే నా ఆయుధం, సత్యమే నాకు మద్దతు అంటూ హిందీలో రాహుల్ ట్వీట్ చేశారు.
సూరత్ మేజిస్ట్రేట్ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన చేసిన అప్పీల్‌పై కోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13కు వాయిదా వేసిన కోర్టు, రాహుల్ గాంధీ అప్పీలుపై నాడు విచారిస్తానంది. సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కేటాయించిన బంగళాను ఖాళీ చేయాల్సిందిగా రాహుల్ నోటీసులు సైతం అందుకున్నారు. దీంతో తనకు కేటాయించిన లుటియన్స్ బంగ్లాను ఖాళీ చేయడానికి రాహుల్ అంగీకరించారు. ఇళ్లును ఖాళీ చేసేందుకు సామాన్లను ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, పారిపోయిన వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, లలిత్ మోదీల గురించి వ్యాఖ్యానిస్తూ… ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వస్తుందని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ఓబీసీ వర్గాలకు అవమానమని, బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు.