పుతిన్‌కు లేఖ రాసిన ట్రంప్ భార్య
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మెలానియా లేఖ
- స్వయంగా అందజేసిన ట్రంప్
- ఉక్రెయిన్, మాస్కోలోని పిల్లల దుస్థితి
- ఉక్రెయిన్ పిల్లలను ఎత్తుకుపోయిన రష్యా
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లేఖ రాయండం కలకలం సృష్టించింది. సుదీర్ఘకాలంగా ఉక్రెయిన్- రష్యా (Ukraine- Russia) కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు చోటు చేసుతున్నాయి. దీన్ని ఆపే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కా వేదికగా భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందు పుతిన్ కు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వ్యక్తిగతంగా ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అలాస్కా భేటీలో ట్రంప్ ఆ లేఖను పుతిన్ (Vladimir Putin) కు అందించినట్లు తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్, మాస్కోలోని పిల్లల దుస్థితి గురించి మెలానియా ఆ లేఖలో ప్రస్తావించారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఆ లేఖలోని ఇతర విషయాలను బయటపెట్టలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది చిన్నారులు తమ కుటుంబాలకు దూరమయ్యారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో దాడి అనంతరం తమ దేశానికి చెందిన వేలాది మంది చిన్నారులను రష్యా తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, యుద్ధభూమిపై దుర్భర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను రక్షిస్తున్నామని మాస్కో తన చర్యను సమర్థించుకుంది. అలాస్కా భేటీపై అమెరికా మాజీ అధికారి ఉక్రెయిన్తో యుద్ధం ఆపడమే లక్ష్యంగా పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారు. చాలాసేపు వీరి మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే, చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. దీనిపై మరోసారి జరిగే సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా పాల్గొంటారని, చక్కటి ఒప్పందం చేసుకోవాలని ఆయనకు సూచిస్తానని భేటీ అనంతరం ట్రంప్ పేర్కొన్నారు.