Andhra PradeshHome Page Slider

అమెరికాలో ట్రంప్ గెలుపు.. ఏపీలో సంబరాలు

అమెరికా అధ్యక్ష పీఠం మరోసారి డొనాల్డ్ ట్రంప్ ను వరించింది. 277 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్రా అల్లుడు ఎంపికయ్యారు. అతను పుట్టి, పెరిగింది అమెరికాలోనే. కానీ.. ఆంధ్రా అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. ఆంధ్రా అల్లుడయ్యాడు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా జేడీ వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు ట్రంప్. అప్పటి నుంచీ అతని భార్య ఉష చిలుకూరి మార్మోగింది. తాజాగా రిపబ్లికన్లు గెలిచి.. అమెరికాలో అధికారాన్ని సొంతం చేసుకోవడంతో మరోసారి ఆమె పేరు తెరపైకొచ్చింది. అయితే.. ఆంధ్రాలోని వడ్లూరు గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. అగ్రరాజ్యానికి ఆంధ్రా అల్లుడే ఉపాధ్యక్షుడు కాబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వీట్లు పంచుకున్నారు. ఉష చిలుకూరి పూర్వీకులది తమ గ్రామమేనని, ఇప్పటికీ వారి బంధువులు ఇక్కడ ఉన్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు ఉష చిలుకూరి పూర్వీకుల గ్రామం. ప్రస్తుతం ఉష తాత రామశాస్త్రి మేనకోడళ్లయిన పారిపూడి నాగమణి, దువ్వూరి విజయలక్ష్మి గ్రామంలోనే ఉంటున్నారు.