ట్రంప్ ప్రమాణ స్వీకారం..తొలి రోజే భారీగా అధికారిక ఉత్తర్వులు
అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు నుండే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొదటిరోజే భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, పుట్టుకతో పౌరసత్వ విధానం రద్దు, కెనడా, మెక్సికోల టారిఫ్‌ల పెంపు, తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదించడం వంటి కీలక పత్రాలపై సంతకం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడి కేసులో 1500 మందికి ఉపశమనం కల్పించడం ద్వారా యూఎస్ న్యాయ చరిత్రలోనే అతిపెద్ద విచారణ, సుదీర్ఘ దర్యాప్తుకు స్వస్తి పలికినట్లయ్యింది. మిలటరీ మినహా అన్ని సమాఖ్య నియామకాలను నిలిపివేశారు. తను యంత్రాంగంపై పట్టు సాధించేవరకూ అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చారు. వాక్ స్వాతంత్య్రంపై సెన్సార్ తొలగింపు, ఫిబ్రవరి 1 నుండి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం పన్ను విధింపు వంటి కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగుతుందంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైట్‌హౌస్ వెబ్సైట్లో ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్, ట్రంప్ సందేశమైన ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసం పోరాడుతా..’ అంటూ హోం పేజీలో ప్రకటించారు.