భారత్‌తో సంబంధాలపై ట్రంప్ స్పందన
భారత్‌తో వాణిజ్య, ఇతర సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అమెరికా ప్రయత్నాలు కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. క్వాడ్ కూటమిలో సహకారం ద్వారా ఇండో-పసిఫిక్ భద్రతకు ఇది దోహదపడనుందని వైట్ హౌస్ వ్యూహత్మకంగా వ్యవహరించనుంది. ‘అమెరికా జాతీయ భద్రతా వ్యూహం’ పేరిట ట్రంప్ సర్కారు తాజాగా వ్యూహపత్రాన్ని విడుదల చేసింది.
దక్షిణ చైనా సముద్రంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్‌తో బలమైన సహకారం అవసరమని వివరించింది. ‘‘మానవజాతి చరిత్రలో అమెరికా అత్యంత విజయవంతమైన, గొప్ప దేశంగా, పుడమిపై స్వేచ్ఛకు నెలవుగా కొనసాగేందుకు ఈ వ్యూహపత్రం ఒక మార్గసూచిగా ఉపయోగపడుతుంది. దేశ సామర్థ్యానికి సంబంధించిన అన్ని అంశాలనూ బలోపేతం చేసుకొని అమెరికాను సురక్షిత, సుసంపన్న, స్వేచ్ఛాయుత, గొప్ప దేశంగా మారుస్తాం’’ అని ఈ పత్రంలో ట్రంప్ సందేశమిచ్చారు.
పశ్చిమార్ధగోళంలో ఉమ్మడి వైఖరులను మరింత బలోపేతం చేసుకునేందుకు ఐరోపా, భారత్ సహా ఆసియాలోని మిత్రపక్షాలతో కలిసి పనిచేయాలని వ్యూహపత్రం నిర్దేశించింది. శాంతియుత అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందారని వ్యాఖ్యానించింది. భారత్-పాకిస్తాన్ , ఇజ్రాయెల్-ఇరాన్, గాజా సహా ప్రపంచవ్యాప్తంగా 8 ఘర్షణలకు ఆయన ముగింపు పలికారని వివరించింది.

