నమిలి మింగేస్తాడు… ఓ రేంజ్‌లో ట్రంప్‌కు వార్నింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ దుమ్మురేగుతోంది. దేశంలోని అనేక సంక్షోభాలతోపాటుగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంశాలపై ఇరువురు నేతలు దూకుడు ప్రదర్శించారు. అమెరికాలో హాట్ టాపిగ్గా ఉన్న అబార్షన్లు, యుద్ధం, ఆర్థిక వ్యవస్థ, గృహ సంక్షోభం తదితర అంశాలపై అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఈవాళ ABC న్యూస్ హోస్ట్ చేసిన మొదటి అధ్యక్ష చర్చలో వాదనలు విన్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 8 వారాల ముందు అటు డెమొక్రట్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తొలిసారి చర్చ వేదిక వద్ద ఒకర్ని ఒకరు పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గత ఎన్నికల సమయంలో బిడెన్, ట్రంప్ మధ్య ఇలాంటి పరిస్థితి రాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన వ్యయంపై కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనది మధ్యతరగతి నేపథ్యమని, ఉన్నత పదవికి ఎన్నికైతే పేద కుటుంబాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిచగలనని ఆమె చెప్పారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని, “బిలియనీర్లు, పెద్ద సంస్థలకు” పన్ను తగ్గింపులను అందిస్తానని చెప్పారు. జో బిడెన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని ఆమె వివరించింది. అసలు ఎన్నికల సందర్భంగా మాట్లాడేందుకు ట్రంప్‌కు ఒక్క అంశం కూడాలేదని ఆమె చెప్పారు.

ఇక బిడెన్ పాలనలో వలసల గురించి ట్రంప్ విమర్శలు మొదలుపెట్టడంతో, కమలా హ్యారిస్ మండిపడ్డారు. ఇంకెంత కాలం అబద్ధాలు చెప్తారు, అవే పాత విషయాలను చెప్పి చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో దుర్భిక్ష్యం తాండవించిందని, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిందని ఆమె చెప్పారు. వందేళ్లలో ఎవరూ చేయని విధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేశారని ఆమె విమర్శించింది. అంతర్యుద్ధం తర్వాత అంతటి ఘోరమైన పాలనను ట్రంప్ ప్రజలకు చూపించారని, ఆ చెత్తను క్లీన్ చేయడానికి తమకు ఇన్నాళ్లు పట్టిందని ఆమె అన్నారు. దీంతో ట్రంప్, కమలా హ్యారిస్ పై వ్యక్తిగత దాడికి దిగారు. “ఆమె మార్క్సిస్టు. ఆమె తండ్రి మార్క్సిస్టు.” అంటూ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో కమలా హ్యారిస్ నవ్వుతూ కన్పించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తాము చేసినట్టుగా పాలన ఎవరూ చేయలేదని ట్రంప్ చెప్పారు. కానీ తమకు ఎవరి నుంచి కూడా కితాబు లభించలేదన్నారు. డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడైతే అబార్షన్‌లను నిషేధిస్తాడని ఆమె చెప్పారు. ఐతే దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. కమలా హ్యారిస్ అబద్ధం చెబుతున్నారని ట్రంప్ అన్నారు. జాతీయ అబార్షన్ నిషేధాన్ని వీటో చేస్తారా అనే ప్రశ్నకు ట్రంప్ ఇరుకుపడినట్టనిపించింది. అలాంటి చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించదని ఆయన అన్నారు.

ట్రంప్ ర్యాలీల్లో హాజరు గురించి కమలా హ్యారిస్ సెటైర్లు వేశారు. మాజీ అధ్యక్షుడి ర్యాలీలలో, హన్నిబాల్ లెక్టర్ వంటి కల్పిత పాత్రల గురించి మాట్లాడుతున్నాడని, ప్రజలు విసుగు చెంది ర్యాలీలకు హాజరుకావడం లేదని ఆమె అన్నారు. దీంతో తన ర్యాలీలకు కాదని, కమలా హ్యారిస్ ర్యాలీలకే ఎవరూ వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒహియోలో హైతీ వలసదారులు కుక్కలను తినడం గురించి సోషల్ మీడియా కుట్ర సిద్ధాంతం గురించి ట్రంప్ మాట్లాడటం ప్రారంభించారు. “స్ప్రింగ్‌ఫీల్డ్‌లో, వారు కుక్కలను తింటారు. లోపలికి వచ్చిన వ్యక్తులు, వారు పిల్లులను తింటారు. అక్కడి పెంపుడు జంతువులను తింటారు.” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో కమలా హ్యారిస్ పెద్దగా నవ్వారు. తనను ప్రజాస్వామ్యానికి ప్రమాదమని డెమొక్రట్లు ప్రచారం చేస్తున్నారని కానీ, వారే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ట్రంప్ చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తమపై ఉన్న కేసులే ఉదాహరణ అని ట్రంప్ అన్నారు. జూలై 13 హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ, తాను బుల్లెట్ దాడిని ఎదుర్కొన్నానని చెప్పారు. కానీ డెమొక్రట్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారని, నేను ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నాకని. తానీ వాస్తవానికి వారు ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన అన్నారు.

“నేను అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రపంచాన్ని చుట్టివచ్చాను. ప్రపంచ నాయకులు డొనాల్డ్ ట్రంప్‌ను చూసి నవ్వుతున్నారు. మీరు అవమానకరం అని వారు అంటున్నారు” అని కమలా హ్యారిస్ ట్రంప్‌పై మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రెండు దేశాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ పరిస్థితి ఎన్నటికీ చేరేది కాదని ట్రంప్ అన్నారు. కమలా హారిస్ ఇజ్రాయెల్‌తో పాటు ఈ ప్రాంతంలోని అరబ్ జనాభాను ద్వేషిస్తున్నారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ వాదనలు నిజం కాదన్న ఆమె తాము ఇజ్రాయెల్‌కు మద్దతిస్తూనే ఉంటామని నొక్కి చెప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉంటాడన్నారు కమలా హ్యారిస్. పుతిన్ ఒత్తిడిని ట్రంప్ తగ్గిస్తారని అన్నారు. ఉక్రెయిన్ తర్వాత, పుతిన్ కీవ్ నుంచి పోలాండ్ మీదుగా యూరప్‌పై యుద్ధం ప్రకటిస్తారని ఆమె చెప్పారు.

రష్యాపై ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యుద్ధాన్ని ముగించడం అమెరికాకు అసరమన్నారు ట్రంప్. ట్రంప్ నిరంతరం బిడెన్ పరిపాలన వైఫల్యాలను ప్రస్తావిస్తే, కమలా హ్యారిస్ అంతకు రెట్టింపుగా నాటి ట్రంప్ వైఫల్యాలను ఎండగట్టారు. బిడెన్, తప్పులను ట్రంప్ ఎత్తి చూపిస్తున్న సమయంలో, కమలా హ్యారిస్ చేసి వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయ్. ట్రంప్ ఇప్పుడు జో బిడిన్ కు వ్యతిరేకంగా నిలబడలేది, కమలా హ్యారిస్‌పై పోటీ చేస్తున్నారని ఆమె అన్నారు. కమలా హ్యారిస్ జాతి నేపథ్యాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారన్న దానికి ట్రంప్ బదులిచ్చాడు. తాను వాటిని పట్టించుకోనన్న ట్రంప్… ఆమె నల్లగా లేదని తెలుసన్నాడు. అమెరికన్లను విభజించడానికి జాతివిద్వేష వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆమె చెప్పారు. తాను బిడెన్ లేదా ట్రంప్ కాదని, కొత్త తరం నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని వ్యాఖ్యానించడంతో, ప్రస్తుతం విభజించి పాలించు అన్నట్టుగా రూల్ ఉందన్నారు.

