ట్రంప్, బైడెన్ భేటీ..ఆ విషయంపైనే కీలక చర్చ
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన ట్రంప్ తొలిసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హైస్‌లో ఈ సమావేశం జరిగింది. స్నేహపూర్వకంగా అధికార మార్పిడికి సహకరిస్తానని బైడెన్ ట్రంప్‌కు మాటిచ్చారు. 2025 జనవరి 20న ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే వీరి భేటీలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కీలక చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం చేయడం దేశ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ ట్రంప్‌కు తెలిపారు. ఐరోపా దేశాలు బలంగా, స్థిరంగా ఉంటేనే అమెరికా ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాలలో ట్రంప్‌కు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు సహాయంపై ట్రంప్ మొదటినుండి కాస్త వ్యతిరేఖంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చలు వచ్చినట్లు స్వయంగా ట్రంప్ మీడియాకు వెల్లడించారు. గాజాలోని అమెరికన్లను విడుదల చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని, తాను అధికారం చేపట్టేలోపే ఆ విషయంలో ఈ డీల్‌పై అధికారవర్గంతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.