టీఆర్‌ఎస్ x గవర్నర్ x డీఎంకే
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇటు తెలంగాణాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో అటు తమిళనాడులో డీఎంకే సర్కారుతో ఏకకాలంలో యుద్ధం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలిని మోదీ సర్కారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై మధ్య కొంత కాలం మంచి సంబంధాలే కొనసాగాయి. అయితే.. పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు తమిళి సై నిరాకరించడంతో వివాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి గవర్నర్‌ను కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్ పాటించకుండా గవర్నర్‌ను అవమానిస్తోంది.

పంచ్.. రివర్స్ పంచ్..
తమిళి సై ఎన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా టీఆర్‌ఎస్ సర్కారు వైఖరిలో మార్పు రాలేదు. దీంతో ఆమె హైదరాబాద్ కంటే చెన్నైలోనే ఎక్కువగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే గవర్నర్ తమిళి సై హైదరాబాద్ వదిలేసి చెన్నైలో ఉంటున్నారని డీఎంకే ఆరోపించింది. దీనిపై మండి పడిన తమిళి సై ఇంట్లో తెలుగు మాట్లాడుతూ తమిళ వేషం వేస్తున్నారంటూ డీఎంకే నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అగ్ని పర్వతంతో చెలగాటం ఆడొద్దంటూ తమిళి సైకు డీఎంకే పంచ్ ఇచ్చింది. హిమాలయాల ముందు అగ్ని పర్వతాలు ఏమీ చేయలేవని.. సింహాల ముందు సాలె పురుగుల కుప్పిగంతులు పని చేయవని గవర్నర్ తమిళి సై రివర్స్ పంచ్ ఇచ్చారు.