కూసుకుంట్లకే టీఆర్‌ఎస్ టికెట్
మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ వీడింది. అందరూ అనుకున్నట్లే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ టీఆర్‌ఎస్ నాయకులు పలు సమావేశాలు, నిరసనలు చేపట్టారు. నియోజక వర్గంలో బీసీ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారని.. బీసీ వర్గానికి చెందిన కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌లలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు కోరారు.

ముగ్గురూ అగ్రవర్ణాల అభ్యర్థులే..
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే.. కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపారు. కానీ.. అందరినీ బుజ్జగించిన తర్వాత అభ్యర్థిని ప్రకటించారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న కూసుకుంట్ల క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని, స్థానిక నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు, సర్వే రిపోర్టులను పరిశీలించిన తర్వాతే ఆయనను ఎంపిక చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించడంతో ఇక ప్రచారం ఊపందుకోనుంది. మొత్తానికి బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న మునుగోడులో అగ్రవర్ణాల అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది.