టీఆర్ఎస్‌కు చావుదెబ్బ!
ముగ్గురు నిందితుల విడుదలకు ఏసీబీ కోర్టు ఆదేశాలు
ముడుపుల మొత్తం లేనందున రిమాండ్ తిరస్కరణ
డబ్బే లేనప్పుడు కరెప్షన్ యాక్ట్ వర్తించదని స్పష్టీకరణ
అరెస్టు తీరుపై పోలీసులను ప్రశ్నించిన న్యాయమూర్తి
ఎమ్మెల్యేల డ్రామా కేసులో టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ సాగిన వ్యవహారంపై ఏసీబీ న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఆధారాలే లేనప్పుడు కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్.. యాక్ట్ కేసు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వర్తించదని తేల్చి చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలు ఆఫర్ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వాదన, న్యాయమూర్తి ఆదేశాలతో వీగిపోయినట్టయ్యింది. కేసుకు అసలు ఆధారమైన ముడుపులు, (లంచం) ఎమౌంట్‌ను, పోలీసులు చూపించకపోవడంతో ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును పక్కనబెట్టారు. కేసు విచారణను 41 CRPC నోటీస్ ఇచ్చి విచారించాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు.

మొత్తంగా రామచంద్ర భారతి, నందకుమార్, సింహాచలం రిమాండ్ తిరస్కరణకు గురయ్యింది. పోలీసులు కేసులో పెట్టిన సెక్షన్లకు ఆధారాల్లేవంటూ కోర్టు ప్రకటించింది. ముగ్గురు నిందితులను తక్షణం విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసులో నిందితులను అరెస్టు చేసిన విధానాన్ని సైతం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తప్పుబట్టారు. ఏసీబీ కోర్టు కామెంట్స్‌తో… ఈ వ్యవహారంలో గంభీరమైన మాటలు మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం పడినట్టయ్యింది. వాస్తవానికి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పనిచేసిందన్న ఉద్దేశం… తాజాగా ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలతో స్పష్టమైంది. ఐతే మొత్తం వ్యవహారంలో నోట్ల కట్టలు చూపిస్తే.. రంగంలోకి ఈడీ, సీబీఐ దిగుతుందేమోనన్న వర్రీ కూడా టీఆర్ఎస్ పెద్దల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం వ్యవహారంలో తమకు చెడ్డ పేరు వస్తోందన్న బెంగలో పోలీసులున్నారని సమాచారం. సుప్రీం కోర్టు జడ్జితో మొత్తం వ్యవహారాన్ని విచారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేయడంతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

