NewsTelangana

వికటించిన ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా!

గులాబీ పార్టీలో మునుగోడు ఉపఎన్నిక టెన్షన్
పథకాలపై నమ్మకం లేదు.. అభివృద్ధిపై ఆశ లేదు..
అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి
8 ఏళ్లగా ఏం చేశారంటున్న జనం
మునుగోడులో టీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తున్న ఓటర్లు
అధికారాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలన్న అభిమతం

తెలంగాణ రాజకీయాలు నిరంతరం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్. అనుకున్నట్టు జరగవు కొన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్టుగా ఉంటాయ్.. కొందరు అమాంతంగా హీరోలైతే.. కొందరు జీరోలుగా క్షణాల్లో మారిపోతారు. కాకుంటే అందుకు టైమ్ చాలా చాలా ముఖ్యం.. కలిసొచ్చేటప్పుడు తిమ్మిని బమ్మి చేయొచ్చు.. కలిసిరాకుంటే తల కిందులుగా, కాళ్లు పైకి పెట్టి తపస్సు చేసినా ఏదీ అక్కరకు రాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరగలేదు. మెజార్టీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. కానీ తొలిసారి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ఓ ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికే మునుగోడు. తెలంగాణ ఏర్పాటయ్యాక.. సంక్షేమంతో హోరెత్తించానని కేసీఆర్ చెప్పుకుంటున్నా… అదంతా ప్రచార అర్భాటానికి తప్ప మరోటి కాదని స్పష్టమవుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కేసీఆర్‌కు గుదిబండగా మారుతున్నాయ్. పక్క రాష్ట్రంలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే.. అని నానుడి రాజకీయంగా పాపులర్ అయ్యింది. కానీ తెలంగాణలో కేసీఆర్ చెప్పాడంటే.. చేస్తాడా లేదా అన్న డౌట్ మాత్రం స్పష్టంగా వస్తుంది.

కేవలం ఎన్నికల రాజకీయాన్ని వంటబట్టించుకున్న కేసీఆర్ ఒక్కో ఎన్నిక విషయంలో ఒక్కోలా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చేందుకు క్షణం కూడా ఆలోచించని కేసీఆర్.. మాటలు మాత్రం చైనా గోడలను దాటేలా చేస్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రదర్శించిన హంగు, ఆర్భాటాలన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయ్. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పరిస్థితేంటో.. ఏమైందో కూడా తెలియని దుస్థితి. వరుణదేవుడు కరుణించడంతో తెలంగాణలో గడిచిన నాలుగైదేళ్లుగా దండీగా వానలు కురుస్తున్నాయ్. ప్రాజెక్టులు వద్దని ఎవరూ చెప్పరు.. కానీ స్వల్ప మొత్తంలో ఖర్చు చేస్తే… మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ వాటిని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల నెత్తిన కాళేశ్వరం రుద్దారు కేసీఆర్. ఇక నిధుల గురించి చెప్పేదేముంది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది. ప్రాజెక్టు కోసం తెచ్చిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టేశాయ్.

2022 నాటికి తెలంగాణ అప్పులు 3 లక్షల 12 వేల కోట్ల రూపాయలకు పైమాటే. 2020లో తెలంగాణ అప్పు 2 లక్షల 25 వేల కోట్లు ఉండగా.. రెండేళ్లలో 87 వేల కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన వేల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయ్. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చెల్లింపులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. TSSPDCL, GENCO, హెల్త్ డిపార్మెంట్ రుణాలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రుణాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాల బాకాయిలు చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయంటున్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు, ఫీజు రీఇంబర్స్మెంట్ కాలేజీల బకాయిలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బిల్లులు సైతం ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ లెక్కిస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పుడు సుమారుగా నాలుగున్నర లక్షల కోట్ల పైనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిమితి నిబంధనలతో కొత్తగా అప్పులు తీసుకోడానికి కూడా నిబంధనలు అనుమతించని దుస్థితి నెలకొంది.

కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు ఏవీ అమలు కాలేదు. రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీకి అతీగతీ లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నట్టుగా పరిణామాలున్నాయ్. 57 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లంటూ మూడేళ్లుగా ఊరించిన కేసీఆర్ సర్కారు.. గత ఆగస్టు కొత్త పింఛన్లు ఇచ్చామంటోంది. ఇక రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ 61 ఏళ్లకు పెంచారు. ఇక కొత్త ఉద్యోగాలు వచ్చేదెలా? ఉద్యోగులపై ప్రేమ ఉందనుకుంటే అది కూడా నిజం కాదని రుజవవుతుంది. సెకండ్ టర్మ్ స్టార్ట్ అయ్యాక… ఉద్యోగులకు ఎన్నడూ జీతాలు టైమ్‌కు ఇవ్వలేదు. ప్రతి నెల జీతం ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి. ఇక నియామకాల విషయానికి వస్తే ఫ్యామిలీ ప్యాకేజ్ తప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో రెండేళ్లుగా ఉద్యోగాలు, ఉద్యోగాలంటూ చెప్పిన కేసీఆర్ సర్కారు.. ఎన్నికల సైరన్ మోగడంతో 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లంటూ రాజకీయంగా మైలేజ్ పొందే ఎత్తుగడ మొదలుపెట్టింది.

దళితులను ఉద్దరించడమే తన జీవితాశయం అని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఆయా పథకాలను అమలు చేస్తున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగడమానదు. దళితబంధు అంటూ హుజూరాబాద్ ఎన్నికల సమయంలో చేసిన హడావుడి ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయింది. అక్కడ పూర్తిగా అమలవుతుందంటే అది కూడా అనుమానమే.. ఇక మునుగోడు మునుగోడు ఎన్నికలు వచ్చేసరికి గిరిజనులకు రిజర్వేషన్ల అంశం గుర్తుకు వచ్చింది. 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు, గిరిజన బంధు కూడా ఇస్తామన్నారు. దళితబంధు, గిరిజన బంధు, బీసీ బంధు.. ఇలా పేర్లు చెప్పడానికి బాగానే ఉన్నా జనాలకు కలుగుతున్న లబ్ధి అంతంతే. ఏ పథకం చూసినా ఏమున్నది గర్వకారణం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే అన్నట్టుగా కేసీఆర్ తీరు కన్పిస్తోంది. హుజూరాబాద్‌లో జనం కర్రుగాల్చి వాత పెట్టడంతో గిరిజనబంధు ప్రకటించినా.. అది ఎన్నికల్లో అంత మైలేజ్ ఇవ్వదేమోనన్న అనుమానంతో ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంబించారు. నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏమేం చేస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికలు వచ్చాయంటూ చాలా ప్రజలను ఏమార్చేందుకు చేయాల్సిన అన్ని జిమ్మిక్కులను గమ్మత్తుగా వదలుతూ పబ్బం గడిపేసుకుంటున్నారు కేసీఆర్.

తాజాగా 4 గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ డ్రామాకు తెరలేపారు. ఒక్కో ఎమ్మెల్యేను వంద కోట్ల రూపాయలతో కొనబోతున్నారంటూ బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే చర్చలు జరిపిన నిందితుడు నందకుమార్, టీఆర్ఎస్ అగ్రనేతల నుంచి కార్పొరేషన్ చైర్మన్లతో కలిసిపోయి వ్యాపారాలు చేసుకుంటున్న చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల రిమాండ్ కు ఏసీబీ కోర్టు అంగీకరించకపోవడంతో మొత్తం వ్యవహారంలో అసలేం జరిగిందన్నదానిపై చర్చోపచర్చలు ఊపందుకున్నాయ్. వాస్తవానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు స్వామీజీలు, టీఆర్ఎస్ పార్టీతో సన్నితంగా ఉన్న నాయకుడు వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎర వేస్తే తమవైపు తిరుగుతారనుకుంటున్న కేసీఆర్ తీరుతో రాష్ట్ర ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికలు-రాకీయాలు చూసి విసిగెత్తిపోతున్నారు. కేసీఆర్‌ తీరును తూర్పారబడుతున్నారు. కానీ కేసీఆర్ అదే మంత్రాన్ని, అదే విద్యను మరోసారి ప్రజల్లో ప్రదర్శించి.. తెలంగాణలో తనకు ఇక తిరుగులేదని రుజువు చేయాలనుకుంటున్నారు. అందుకే మునుగోడు గడ్డపైకి టీఆర్ఎస్ నేతలు గద్దల్లా వాలిపోయారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలోకీ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఛైర్మన్‌ను రంగంలోకి దించారంటే పొజిషన్ అర్థం చేసుకోవచ్చు.