NewsTelangana

మునుగోడు ఓటర్లకు టీఆర్ఎస్ గడియారాలు

మునుగోడులో ఎలాగైనా గెలిచితీరాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ఎరవేస్తోంది. నియోజకవర్గంలోని కోయలగూడెంలో ఓటర్లకు గడియారాల పంపిణీ చేయగా… ఓటర్లు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచిన కిష్టాపురం ఎంపీటీసీ సభ్యుడు సైదులు.. కార్యకర్తలు నిలదీయడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రానున్న మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఎన్నికల్లో గెలిచి తీరాలని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టాయ్. దీంతో మునుగోడులో రాజకీయం అప్పుడే మొదలైపోయింది. చౌటప్పల్ మండలంలోని టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులకు గడియారాల పంపిణీ అప్పగించినట్టు తెలుస్తోంది. ఊళ్లో ఉన్న కుటుంబాల సంఖ్యను బట్టి.. టోకుగా గడియారాలు సరఫరా చేసినట్టు సమాచారం. గడియారంలో సీఎం కేసీఆర్ ఫోటోతోపాటు, కారు గుర్తును ముద్రించారు. కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ తమ గ్రామాన్ని రెండుగా విడిగొట్టారన్న కారణంతో కోయలగూడెం గ్రామస్తులు గోడ గడియారాలను తీసుకోడానికి నిరాకరించడం విశేషం. ఇంకా ఎన్నిక ప్రక్రియ మొదలు కాక ముందే ఎన్నో చిత్రాలు కన్పిస్తుంటే… వచ్చే రోజుల్లో మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం.