ఎమ్మెల్యే సొంతూరులో గిరిజనుల తిరుబాటు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి మంగళవారం గ్రామసభ ఏర్పాటు చేయగా.. అధికారులు, కాంగ్రెస్ నాయకులను తండా ప్రజలు నిలదీసి అమీనాబాద్‌లో తమ తండాను ఎట్టి పరిస్థితుల్లో విలీనానికి అంగీకరించమని మౌఖికంగా హుకుం జారీ చేశారు.తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు తమ తండా పైకి వచ్చి దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని, తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో విలీనం చేయరాని తీర్మానించి తిరుబాటు చేశారు. తమ తండాను యధావిధిగా గ్రామపంచాయతీగా కొనసాగించాలని అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.తెలంగాణలో ఒక్కో చోట ఒక్కో లగచర్ల పుట్టుకొస్తుందా అన్న భయంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఎమ్మెల్యేపై దాడి చేస్తారేమో అన్న భయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ నాయకులను గిరిజనులు పరుగులు పెట్టించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.