పాక్ గగనతలంపై ప్రయాణం ప్రమాదకరమే
పాకిస్తాన్ గగనతలంపై ప్రయాణం ప్రమాదకరమేనంటూ వ్యాఖ్యానించింది యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ వంటి నగరాలపై విమానాలు ఎగరడం ప్రమాదకరంగా మారొచ్చని వీరు అభిప్రాయపడ్డారు. ఈ ప్రదేశాలలో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పు పొంచి ఉందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. పాకిస్తాన్‌లో ఉన్న కొన్ని హింసాత్మక సమూహాల వద్ద విమానయాన నిరోధక ఆయుధాలు, మ్యాన్‌ప్యాడ్స్, ఎయిర్ డిఫెన్స్ పరికరాలు ఉన్నాయని, అందుకే 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణాలు చేయవద్దని సూచించింది. 2024 జనవరి 31 వరకూ ఈ సూచనలు పాటించాలని పేర్కొంది. దీనిపై పాకిస్థాన్ పౌర విమానయాన అథారిటీ మండిపడింది. తమ గగనతలం అన్ని రకాల విమానాలకు సురక్షితమేనని, ఈ సర్క్యులర్‌ను రద్దు చేసుకోమని పేర్కొంది. ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ స్పందిస్తూ తమ దేశ గగన తలం పూర్తిగా భద్రమైనదని, అన్ని రకాల చొరబాటు దార్ల నుండి రక్షణ కలిగి ఉందని పేర్కొంది. భయాన్ని కలిగించడం ద్వారా తమ ఆర్థిక కార్యకలాపాల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

