డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే సీపీఆర్‌లో శిక్షణ తప్పనిసరి..
ఆపదలో పొరుగువారికి సహాయపడడంలో ఎంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది. అలాంటిది వారి ప్రాణం కాపాడితే వారి కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటుంది. మనం కారులో లేదా బైకుపై రోడ్లపై వెళుతున్నప్పుడు దారిలో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చిందనుకోండి. మనం ఏంచెయ్యాలో తెలియక చేష్టలుడిగి నిలబడిపోతాం. అదే ఆవ్యక్తికి కార్డియో పల్మనరీ పునరుజ్జీవనం చేస్తే (CPR) చేస్తే బతికే అవకాశాలుంటాయి. ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకూ గుండెపోటు బారిన పడుతున్నారు. దీనికి కరోనా తర్వాత ఆరోగ్యపరిస్థితులే కారణమని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.

ఇలా హార్ట్ ఎటాక్‌కు గురైన వారిని అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తరలించేలోపు గుండె ఆగిపోయి మరణించే ప్రమాదముంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఇప్పటికే చాలామంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఇలాంటి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల గుండెనొప్పితో కుప్ప కూలిన వారిని పోలీసులు కాపాడిన వీడియోలు సోషల్ మీడియోలో చక్కర్లు కొట్టాయి. దీని సత్ఫలితాల కారణంగా ఇలాగే వాహనదారులందరికీ కూడా అవగాహన ఉంటే, రోడ్డుపై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే వారి శాతం బాగా తగ్గగలదని, నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలోని రవాణా శాఖ కార్యాలయాలలో లైసెన్సుల జారీ చేసే ప్రాంతాలలో లైసెన్స్‌ల కోసం వచ్చేవారికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలనుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. బైక్ లేదా కారు లైసెన్సుకు వచ్చేవారికోసం ఆయా కార్యాలయాలలోనే శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో వైద్యనిపుణులను కూడా ఉంచుతారు.

