విజయవాడ సింగ్ నగర్ లో ఫుడ్ అమ్మకానికి పెట్టిన వ్యాపారులు
విజయవాడలో ఓ వైపు వరద ముంచెత్తి, ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. ఇదే అదనుగా చూసుకుని ఆ కష్టాల్లో ఉన్నవారిని దోచుకుంటున్నారు కొంత మంది ప్రబుద్ధులు. అవకాశం దొరికినప్పుడే కొంత సొమ్మును వెనకేసుకోవాలని భావిస్తున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లో వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి అమ్మకానికి పెడుతున్నారు. శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్లి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లేదని బాధితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం పంపిణీ చేయలేదని బాధితులు ఆందోళనలు చేపట్టారు. బ్లాక్‌లో ఆహారం కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని బాధితులు చాలా బాధపడుతున్నారు.