Home Page SliderTelangana

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..బయటకు రావొద్దంటున్న అధికారులు

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. మొన్నటివరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నగరవాసులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇవాళ మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లోని ఆల్వాల్, మాదాపూర్, జూబ్లీహిల్స్,యూసఫ్‌గూడ,బోరబండ,వివేకానందనగర్,అల్లాపూర్,జగద్గిరిగుట్ట,కూకట్‌పల్లి తదితర ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలైన యాదగిరిగుట్ట, యాచారం, ఘట్‌కేసర్, సదాశివపేట్, ఆదిభట్ల, చౌటుప్పల్‌లో భారీగా వర్షం కురుస్తోంది. ఈ మేరకు రాబోయే గంటలో ఈ వర్షం సిటీ మొత్తం విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు.