కుప్పకూలిన టమాటా ధర
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో టమాటా ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. మార్కెట్‌కు టమాటా సరఫరా ఒక్కసారిగా పెరగడంతో ధరలు దారుణంగా క్షీణించాయి. గత కొద్దిరోజుల క్రితం వరకు కిలో రూ. 50 పలికిన ధర, ఇప్పుడు అట్టడుగు స్థాయికి పడిపోవడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి పది కిలోల బాక్స్ ధర రూ. 300 నుంచి రూ. 600 వరకు పలకగా, ప్రస్తుతం మదనపల్లె, పలమనేరు మార్కెట్లలో కేవలం రూ. 90 నుంచి రూ. 140 వరకు మాత్రమే పలుకుతుండటం మార్కెట్ పతనానికి అద్దం పడుతోంది.
ధరల క్షీణతకు తోడు పక్క రాష్ట్రాల నుంచి దిగుబడి భారీగా పెరగడంతో వ్యాపారులు కిలో టమాటాకు రూ. 10 కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం రైతులకు కిలోకు కేవలం రూ. 5 మాత్రమే దక్కుతోంది. ఈ స్వల్ప ధరతో పంట కోతకు అయ్యే కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రవాణా ఖర్చులు కూడా భారమవడంతో, మార్కెట్‌కు తీసుకెళ్తే అదనపు నష్టమే మిగులుతుందనే భయంతో చాలా మంది రైతులు తమ పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు ఆవేదనతో పండించిన పంటను ఉచితంగా ప్రజలకు పంచుతుండగా, మరికొందరు రోడ్లపై పారబోస్తున్నారు.
వేల రూపాయల అప్పులు చేసి, ఎండనక వాననక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని, టమాటాకు మద్దతు ధర కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెట్టిన పెట్టుబడులు కూడా రాక తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన చెందుతున్నారు.

